Tata Sierra EV శాంక్చురీ ఎడిషన్ ఆవిష్కరణ.. జంగిల్ సఫారీకి ప్రత్యేకంగా సిద్ధమైన ఎస్యూవీ!
సియెర్రా ఈవీ శాంక్చురీ ఎడిషన్‌ను వ్యక్తిగత వినియోగానికి విక్రయించే అవకాశం తక్కువే. అయితే కమర్షియల్ సఫారీ వాహనంగా ఉపయోగించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
- ఒక వ్యాఖ్యను వ్రాయండి

టాటా మోటార్స్ తాజాగా Tata Sierra EVని భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ సందర్భంగా సియెర్రా ఈవీ శాంక్చురీ ఎడిషన్‌ను కూడా ఆవిష్కరించింది. ఇది సాధారణ సియెర్రా ఈవీకి పూర్తిగా భిన్నంగా, జంగిల్ సఫారీల కోసం ప్రత్యేకంగా రూపొందించిన మోడల్. ప్రస్తుతం దీనిని విక్రయిస్తారా లేదా అనే విషయంపై కంపెనీ ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ఒకవేళ మార్కెట్లోకి తీసుకొస్తే మాత్రం ఇది ఆసక్తికరమైన మోడల్‌గా నిలవనుంది. ప్రస్తుతం ఈ ప్రత్యేక ఎడిషన్‌లో ఉన్న విశేషాలపై ఓ లుక్కేద్దాం.
సియెర్రా ఈవీ శాంక్చురీ ఎడిషన్ అంటే ఏమిటి?
సాధారణ సియెర్రా ఈవీని జంగిల్ సఫారీ వాహనంగా మార్చిన రూపమే శాంక్చురీ ఎడిషన్. ముందు భాగంలో ప్రొడక్షన్ మోడల్ డిజైన్‌ను అలాగే ఉంచినా, వన్యప్రాణి పర్యాటకం, ఆఫ్‌రోడ్ వినియోగానికి అనుగుణంగా పలు మార్పులు చేశారు.
A post shared by CarDekho India (@cardekhoindia)
ఈ మోడల్లో ప్రధాన ఆకర్షణ ఓపెన్-టాప్ క్యాబిన్. సాధారణ రూఫ్ స్థానంలో ఓపెన్ ఎయిర్ డిజైన్‌ను అందించారు. నాలుగు పిల్లర్లపై అమర్చిన ఎత్తైన కానోపీ ఎండ నుంచి రక్షణ కల్పించడంతో పాటు చుట్టూ స్పష్టమైన వీక్షణను అందిస్తుంది.

వెనుక భాగాన్ని పూర్తిగా మార్చి 8 మంది కూర్చునేలా రూపొందించారు. స్టేడియం తరహాలో మెట్ల ఆకారంలో సీట్లు అమర్చడం వల్ల ప్రయాణికులు అడవిలోని పరిసరాలను మరింత స్పష్టంగా వీక్షించే అవకాశం ఉంటుంది.

శాంక్చురీ ఎడిషన్‌లో ముందు భాగంలో బుల్ బార్, ఎలక్ట్రిక్ రికవరీ వించ్, తక్కువ వెలుతురులో మెరుగైన విజిబిలిటీ కోసం రెండు భారీ ఆక్సిలరీ స్పాట్లైట్లు అమర్చారు. సాధారణ అల్లాయ్ వీల్స్ స్థానంలో ఆల్-టెర్రైన్ టైర్లతో కూడిన వీల్స్ ఇచ్చారు. అలాగే పర్ఫొరేటెడ్ సైడ్ స్టెప్స్, వెనుక గ్రాబ్ రైల్స్, రియర్ యాక్సెస్ స్టెప్ వంటి సదుపాయాలు ఉండటంతో ఎత్తైన క్యాబిన్లోకి ఎక్కడం, దిగడం సులభంగా ఉంటుంది.
టాటా సియెర్రా ఈవీ: ఇతర ఫీచర్లు, సేఫ్టీ
టాటా సియెర్రా ఈవీలో 12.3 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, వైర్లెస్ యాపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, 12.3 అంగుళాల కో-ప్యాసింజర్ డిస్ప్లే, 10.25 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, పనోరమిక్ సన్‌రూఫ్, హెడ్-అప్ డిస్ప్లే (HUD), వైర్లెస్ ఫోన్ ఛార్జర్, NFC కార్డ్ కీ, ఎయిర్ ప్యూరిఫైయర్, గెశ్చర్ కంట్రోల్ పవర్డ్ టెయిల్‌గేట్, 12-స్పీకర్ జేబీఎల్ సౌండ్ సిస్టమ్, V2L, V2V టెక్నాలజీలు, సమ్మన్ మోడ్, ఆటో పార్క్ అసిస్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

ప్రయాణికుల సౌకర్యం కోసం వెంటిలేటెడ్, 6-వే పవర్ అడ్జస్టబుల్ ఫ్రంట్ సీట్లు, మెమరీ ఫంక్షన్, కో-డ్రైవర్‌కు బాస్ మోడ్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, వెనుక సన్‌షేడ్స్‌ను అందించారు.
సేఫ్టీ పరంగా 6 ఎయిర్‌బ్యాగ్స్, బోనెట్ కింద భాగాన్ని కూడా చూపించే 540 డిగ్రీ కెమెరా, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), ఆటో హోల్డ్‌తో ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, TPMS, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ యాంకరేజెస్, నాలుగు వీల్స్కూ డిస్క్ బ్రేక్స్, ముందు-వెనుక పార్కింగ్ సెన్సర్లు, లెవెల్-2 ఏడీఏఎస్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
టాటా సియెర్రా ఈవీ: పవర్‌ట్రెయిన్
టాటా సియెర్రా ఈవీ రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో అందుబాటులో ఉంది. పెద్ద బ్యాటరీ ప్యాక్‌తో పాటు డ్యూయల్ మోటార్ ఆల్ వీల్ డ్రైవ్ (AWD) ఆప్షన్ కూడా లభిస్తుంది. పూర్తి సాంకేతిక వివరాలను కంపెనీ వెల్లడించింది.
| బ్యాటరీ ప్యాక్ |
63 kWh |
75 kWh |
75 kWh |
| ఎలక్ట్రిక్ మోటార్(ల) సంఖ్య |
1 |
1 |
2 |
| క్లెయిమ్ చేయబడిన రేంజ్ (MIDC పార్ట్ 1+2) |
565 km |
665 km |
624 km |
| పవర్ |
238 PS |
209 PS |
209 PS (rear motor), 140 PS (front motor) |
| టార్క్ |
315 Nm |
315 Nm |
504 Nm |
| DC ఫాస్ట్ ఛార్జింగ్ సమయం (0 నుండి 80 శాతం) |
25 నిమిషాలు |
26 నిమిషాలు |
26 నిమిషాలు |
| డ్రైవ్‌ట్రెయిన్ |
రేర్ వీల్ డ్రైవ్ (RWD) |
రేర్ వీల్ డ్రైవ్ (RWD) |
ఆల్ వీల్ డ్రైవ్ (RWD) |
టాటా సియెర్రా ఈవీ: ధర, ప్రత్యర్థులు
సాధారణ టాటా సియెర్రా ఈవీ ధర రూ.18.79 లక్షల నుంచి రూ.25.99 లక్షల (ఎక్స్‌షోరూమ్) మధ్య నిర్ణయించారు. బుకింగ్స్, డెలివరీ వివరాలను కూడా కంపెనీ ప్రకటించింది. వేరియంట్ల వారీగా ధరలను కూడా వెల్లడించింది.
ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీకి Mahindra BE 6, Hyundai Creta Electric, MG ZS EV, VinFast VF6, VF7, Maruti e Vitara, Toyota Ebella ప్రధాన ప్రత్యర్థులు.
కార్దెకో అభిప్రాయం...
ఇప్పటివరకు భారత అడవుల్లో మారుతి జిప్సీ, మహీంద్రా బొలెరో క్యాంపర్, ఫోర్స్ గుర్ఖా వంటి ఐసీఈ వాహనాలనే సఫారీల కోసం ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో సియెర్రా ఈవీ శాంక్చురీ ఎడిషన్ ద్వారా నగర వినియోగానికే కాకుండా జంగిల్ సఫారీలకు కూడా ఎలక్ట్రిక్ వాహనాలు అనువుగా ఉంటాయని టాటా చాటిచెప్పింది. నిశ్శబ్దంగా పనిచేసే ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్, ఆల్ వీల్ డ్రైవ్ సామర్థ్యం కలిసివస్తే, సఫారీ ఆపరేటర్లు, అటవీ శాఖకు ఇది మంచి ప్రత్యామ్నాయంగా మారే అవకాశముంది.














